Recents in Beach

సమస్యలను చూసి భయపడుతున్నావా

సమస్యలను చూసి భయపడుతున్నావా 


మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికి వందనములు. చాలా మంది తమ జీవితంలో వచ్చే కష్టాలను, సమస్యలను చూసి బయపడిపోవడం, దేవునికి దూరం అవ్వడం చేస్తున్నారు. బైబిలులో గమనించినట్లయితేఫిలిష్తీయులకు, ఇశ్రాయేలియులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం లో ఫిలిష్తీయులకు ఉండే బలం “గొలియాతు”, అతడు బలవంతుడు, శూరుడు, ఇంచుమించు 10 అడుగులు పొడవు గలవాడు. ఈ గొలియాతు ఇశ్రాయేలియులకు ఛాలెంజ్ చేస్తున్నాడు, “నాతో యుద్ధం చేసి గెలవండి” అని. కాని ఇశ్రాయేలియులలో ఏ ఒక్కడు కూడా గొలియాతుతో యుద్ధం చెయ్యడానికి ముందుకు రావటం లేదు. గొలియాతుని చూడగానే బయపడి పారిపోతున్నారు (1 సమూయేలు 17:24)
ఇశ్రాయేలియులు దేవుని యొక్క బిడ్డలు, జీవము గల దేవుని ఆరాధిస్తున్న సైన్యం. అటువంటి సైన్యం గొలియాతుని చూసి అతనితో యుద్ధం చేయలేక బయపడి పారిపోతుంది.
నిజమే, ఈ రోజులలో ఎంతోమంది జీవము గల దేవుని ఆరాధిస్తున్నాముఅని చెప్పుకునే క్రైస్తవులు, యేసు క్రీస్తు మా దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు, సమస్యలు, శ్రమలు, కష్టాలు రాగానే వాటిని చూసి పారిపోవడం లేదా? వాటిని జయించలేక, సాతానుకు బానిసలుగా మారేవారు చాలామంది ఉన్నారు.
ఈ సందేశం చదువుతున్న వారిలో కూడా, సమస్యలను చూసి, కష్టాలను భరించలేక, సమస్యలను జయించలేక, దేవుని మీద నిందలు వేస్తున్నవారు, దేవునికి దూరం అవుతున్నవారు, ఈ బ్రతుకు ఎందుకు, చనిపోతే బాగుండు అని అనుకుంటున్నవారు? నాకు ఉద్యోగం రాదు, నా సమస్యలు తీరుటలేదు, పెళ్ళిళ్ళు కావు, ఆర్దికంగా ముందుకు వెళ్ళలేము, ఇక నా జీవితం ఇంతే అనుకునేవారు చాలా మంది ఉన్నారు.
మానసికంగా, శారీరకంగా సమస్యలతో బాదపడుతూ, వాటి నుండి విడుదల పొందలేక, ఒక పక్క దేవుని మీద నమ్మకం లేక, తమలో తాము క్రుంగిపోయే వారు చాలామంది ఉన్నారు. ఒక సారి గొలియాతు, దావీదు మధ్య జరిగిన యుద్ధాన్ని గుర్తు చేసుకోండి. ఇశ్రాయేలియులు గొలియాతుని చూసి పారిపోతున్నారు,ఆ సమయములో దావీదు అక్కడికి వచ్చాడు. ఇశ్రాయేలు రాజు అయిన సౌలుతో అంటున్నాడు,
రాజా నేను ఆ గొలియాతుతో యుద్ధము చేసి అతనిని చంపుతాను అని అంటున్నాడు. దావీదుకి ఏంటి అంత దైర్యం? దావీదు కన్నా గొలియాతు బలవంతుడు, దావీదు కన్నా గొలియాతు ఎంతో ఎత్తు కలిగిన వాడు, దావీదుకి యుద్ధం చేసే అలవాటు లేదు, గొలియాతు మాత్రం యుద్దంలో ఆరితేరినవాడు (నేర్పరి) (1 సమూయేలు 17:33) దావీదు ఏరకంగా కూడా గొలియాతుకు సరిపోడు.
యుద్ధంలో గొలియాతును చూసి అందరూ పారిపోతున్నారు.కాని దావీదు మాత్రం గోలియాతుని చంపుతాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆలోచిందండి ఒక సారి, దావీదుకు ఉన్న బలం, దైర్యం ఏంటో తెలుసా? 1 సమూయేలు 17:37 చూస్తే ఒకప్పుడు నన్ను సింహం నుంచి రక్షించిన దేవుడే ఈరోజు ఈ గొలియాతు నుండి కూడా నన్ను విడిపిస్తాడు, విజయం దయచేస్తాడు అని అంటున్నాడు. దేవుడే దావీదు యొక్క బలం, ఎంత విశ్వాసం ఉంది చూడండి దావీదులో, ఈ రోజు ఆ విశ్వాసం మనలో ఉందా? ఆలోచించండి ఒక సారి. దావీదు యుద్ధం యెహోవాదే (1 సమూయేలు 17:47) దేవుడు నా పక్షాన వున్నాడు, దేవుడే నా బలం అనుకుని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు, యుద్ధం చేసాడు, గొలియాతుని చంపి తన తల తీసుకొని వచ్చాడు.
బాలుడు అయిన దావీదు గొలియాతుని హతం చేసాడు. గోలియాతుని చంపడం నీ వల్ల కాదు అని అందరూ అన్నారు. అయినా దావీదు ఎవరి మీద నమ్మకంతో యుద్ధం చేసాడు? తను ఆరాదిస్తున్నటువంటి దేవుని మీద నమ్మకంతో. నా ప్రియ స్నేహితుడా, నువ్వు ఎదుర్కొంటుంది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, నీ దృష్టికి ఆ సమస్య బలంగా కనపడవచ్చు, అసాధ్యం అనిపించవచ్చు, కాని నువ్వు నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు అయిన దేవుడు అనే విషయం మరచిపోకు (యెషయా 9:6). దావీదుని సింహం నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన దేవుడు నీ సమస్యల నుండి నిన్ను రక్షించలేడా? బాలుడు అయిన దావీదుకు తోడుగా వుండి, తన పక్షాన నిలబడి యుద్ధం చేసిన దేవుడు, నీ పక్షాన నిలబడి నీ సమస్యలతో యుద్ధం చెయ్యలేడా? ఆలోచించండి.
దేవునికి సమస్తము సాధ్యము. ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, విశ్వాసముతో ఈ రోజు నుండి నువ్వు ప్రార్థించు. పాపాన్ని వదిలిపెట్టి, విశ్వాసముతో, నిరీక్షణ కలిగి యుద్ధం యెహోవాదే, దావీదు పక్షాన వున్నా దేవుడు నా పక్షాన కూడా యుద్ధం చేస్తాడు, నన్ను సమస్యల నుండి ఎదో ఒక రోజు విడిపిస్తాడు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళు. తప్పక విజయం పొందుతావు. అట్టి కృపను దేవుడు మన అందరికి దయచేయును గాక, ఆమెన్.

Post a Comment

0 Comments