దేవుడు ఆ ప్రవక్తల మీదికి అబద్దములాడు ఆత్మను
ఎందుకు పంపాడు?
యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. (1రాజులు 22:23)
ఈ వచనం చదవగానే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యెహోవా ఏంటి? ప్రవక్తల నోట అబద్దమాడు ఆత్మను ఉంచడం ఏంటి? ఆ అబద్దమాడు ఆత్మ యెహోవా దగ్గర నుండి రావడం ఏంటి? అనే సందేహాలు తప్పక కలుగుతాయి. వీటికి సమాధానం తెలుసుకునే ముందు ఇంతకు దేవుడు ఏ ప్రవక్తల నోట అబద్దమాడు ఆత్మ ఉంచాడు? ఇది ఏ సందర్భములో జరిగినది చూద్దాము.
దేవుడు ఆహాబును గురించి కీడు యోచించాడు. ఈ ఆహాబు ఎవరో కాదు ఎజెబెలు భర్త. ఆహాబు జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే 1 రాజులు 16:28 వచనం నుండి 1 రాజులు 22 అధ్యాయం వరకు చదవండి. ఆహాబు ఎంత దుర్మార్గుడో తెలుస్తుంది.
మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజులందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. (1రాజులు 16:33)
ఒకరోజు ఆహాబు, ఎజెబెలు కలిసి నాబోతు అనే వ్యక్తి యొక్క ద్రాక్ష తోట కోసం అతనిని చంపి, అన్యాయముగా ఆ ద్రాక్ష తోటను స్వాధీన పరచుకుంటారు (1 రాజులు 21వ అధ్యాయం). అప్పుడు యెహోవా ఏలియా ద్వారా తన మరణం గురించి ఒక ప్రవచనం చెప్తాడు.
యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. (1రాజులు 21:19)
యెహోవా సెలవిచ్చునదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. (1రాజులు 21:19)
ఇప్పుడు ఆ ప్రవచనం నేరవేరాలి, ఆ సమయం రానే వచ్చింది.
ఇశ్రాయేలు రాజయిన ఆహాబు, యూదా రాజు అయిన యెహోషాపాతు ఇద్దరు కలిసి సిరియా రాజు మీదకు యుద్ధానికి వెళ్ళాలి అనుకొంటారు. అప్పుడు యెహోవా వద్ద విచారణ చేద్దాము అనుకుంటారు. అందుకు ఆహాబు 400 మంది ప్రవక్తలను పిలుస్తాడు, 400 మంది ప్రవక్తలు కూడా యుద్ధానికి వెళ్ళండి, జయం పొందుతారు అని ఏకమనసుతో చెప్తారు (1 రాజులు 22:6,11,12).
అయితే యూదా రాజు అయిన యెహోషాపాతు ఆ 400 మంది అబద్ద ప్రవక్తలు అని గుర్తించాడు. వారిలో ఒకరి మాట కూడా యెహోషాపాతు నమ్మలేదు, అందుకే అంటున్నాడు “యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను” (1రాజులు 22:7).
అవును వారందరూ అబద్ద ప్రవక్తలు నిజమైన యెహోవా ప్రవక్తలు కారు. అందుకే మీకాయా కూడా 22:23 వచనంలో నీ (ఆహాబు) ప్రవక్తల నోట అంటాడు. వారందరూ రాజుకు అనుకూలంగా మాట్లాడేవారు, డబ్బు కోసం, రాజు ఇచ్చే బహుమతుల కోసం యెహోవా పేరిట సొంత ప్రవచనాలు చెప్పేవారు (వీరిలో కొందరు మారు వేషం వేసుకొన్న బయలు దేవత ప్రవక్తలు కూడా ఉండొచ్చు)
ఇట్టి ప్రవక్తలకు యెహోవా విరోధి (యిర్మియా 23:30)
కనుక దేవుడు నిజమైన ప్రవక్తల నోట అబద్దమూలాడు ఆత్మను ఉంచలేదు, అప్పటికే తన నామమున దొంగ ప్రవచనాలు చెప్తూ బ్రతుకుతున్న అబద్ద ప్రవక్తల మీదకు అబద్దమూలాడు ఆత్మను పంపించాడు అనేది స్పష్టం.
ఇక ఆహాబు తనకు అనుకూలముగా మాట్లాడే ప్రవక్తలను పిలిపించాడు తప్ప నిజమైన యెహోవా ప్రవక్తలను పిలిపించలేదు. యెహోవా ప్రవక్తలు అన్నా, తనకు ప్రతికూలముగా మాట్లాడే వారన్నా ఆహబుకు అసలు ఇష్టం ఉండదు. ఆహాబు ఏలియా ప్రవక్తను పగవాడిగా (శత్రువుగా) ఎంచాడంటే తను సత్యాన్ని ఎంత ద్వేషిస్తున్నాడో అబద్దాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్ధం అవుతుంది (1 రాజులు 21:20)
ఈ విధముగా సత్యాన్ని ద్వేషించి, అబద్దాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు బ్రష్ట మనసుకు అప్పగిస్తాడు (రోమా 1:25,28) దురాత్మలకు వారి మీద అధికారం ఇస్తాడు.
ఎందుకంటే సాతాను (దురాత్మ) సంబందమైన క్రియలను వారు ఇష్టపడతారు కనుక దేవుడు వారిని దురాత్మలకు అప్పగిస్తాడు.
కొందరు మనుషులకు, వారి పాపాలకు శిక్షగా దేవుడు ఇలాంటి దురాత్మలను వారి మీదికి పంపుతాడు, సౌలు, అబీమేలేకు చేసిన పాపాలకు శిక్షగా దేవుడు వారి మీదికి దురాత్మలను పంపినట్లు బైబిలులో కనపడుతుంది (న్యాయాధిపతులు 9:23,24; 1 సమూయేలు 16:14)
అయితే ఇలా చెయ్యడానికి దేవుడు దురాత్మలకు అనుమతి ఇవ్వాలి, ఆ దురాత్మలకు దేవుడు అనుమతి ఇస్తాడు కాబట్టి యెహోవా యెద్ద నుండి దురాత్మ వచ్చినట్లు, పంపినట్లు, ప్రేరేపించినట్లు వ్రాయబడి ఉంటుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ప్రతీది అయన ఆధీనంలోనే ఉంటాయి. అయితే ఈ దురాత్మలను దేవుడు పాపుల మీదికి, బ్రష్టుల మీదికి పంపుతాడు.
అందుకే దేవుడు ఆహాబును ప్రేరేపించేలా అబద్దమాడు ఆత్మని పంపాడు. ఆహాబు జీవించిన దుర్మార్గమైన జీవితానికి, తను చేసిన పాపాలకు శిక్షగా “తను ఏ అబద్దాలను అయితే ప్రేమించాడో, అదే అబద్దాలకు సంబందించిన ఆత్మ ద్వారా తను యుద్ధానికి వెళ్ళేలా దేవుడు తనను ప్రేరేపించాడు”, మరణించేలా చేసాడు. దేవుడు ఆ అబద్దములాడు ఆత్మకే ఆహబును అప్పగించేసాడు.
అన్యాయముగా ఎందరో ప్రవక్తలను తన భార్యతో కలిసి చంపాడు, నాబోతు అనే సామాన్య వ్యక్తిని కూడా చంపాడు (1 రాజులు 21 అధ్యాయం). ఆ నాబోతు ఏ స్థలంలో అయితే మరణించాడో, ఏ స్థలంలో అయితే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకాయో అదే స్థలమందు ఆహాబు రక్తాన్ని కుక్కలు నాకాయి (1 రాజులు 21:19, 22:38)
దేవుని ప్రవచనం నెరవేరింది, ఇది దేవుని న్యాయం.
బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున నున్నారు. (యోబు 12:16)
భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోకసేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు. (దానియేలు 4:35)
దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. (కీర్తనలు 18:30)
దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము. (కీర్తనలు 18:30)
0 Comments